భారతీయ సనాతన ధర్మం కాలపరిమితి లేని జీవన తత్వం. అది ప్రతి జీవిలో నిగూఢంగా వ్యాపించిన చైతన్య ప్రకాశమే అని చెప్పేందుకు తగిన ఆధారంగా డా.పి.భాస్కరయోగి రచించిన ‘అంతరార్థం’ వ్యాస సంపుటి నిలుస్తుంది. మానవ జీవితంలో సనాతన ధర్మపు సూక్ష్మతలు ఎలా ప్రతిఫలించగలవో రచయిత 97 ఆధ్యాత్మిక వ్యాసాల్లో తపోనిష్టతో, తాత్వికంగా ప్రకటించారు.
ఆ తాత్వికతకు బలమైన ఆధారం ఆధ్యాత్మికత. పురాణేతిహాసాలు, భగవద్గీత, యోగశాస్త్రం మున్నగు భారతీయ గ్రంథాలు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు మొదలగు వారి జీవితాలను తార్కాణంగా సంగ్రహించి సులభమైన శైలిలో రచయిత ఈ వ్యాసాలను అందించారు. జ్ఞానం కేవలం పఠనంలో కాక, ఆచరణలోనే ఉత్కృష్టతను పొందుతుందన్న ఆలోచన ఈ గ్రంథంలో కనిపిస్తుంది.
అంతరార్థం గ్రంథంలోని ప్రతి వ్యాసం భారతీయ ధర్మాన్ని, సంస్కృతిని భిన్న కోణాలలో పరిశీలిస్తుంది. వ్యక్తిగత, సామాజిక, ఆధ్యాత్మిక, జాతీయ ధర్మం అనేది ఒక జీవన విధానమని ఎన్నో తార్కిక దృష్టాంతాల ద్వారా ఈ గ్రంథం స్పష్టపరుస్తుంది. ‘బోధించడం ఉత్తముల ధర్మం’ అనే వ్యాసం ఆధ్యాత్మిక కర్తవ్యాన్ని, సమాజ మార్పులో గురువు పాత్రను స్పష్టంగా తెలియజేస్తుంది.
సంఘంలో ఉత్తమ గుణాలు నిర్మించడానికి జ్ఞానుల ప్రబోధాలు ఉపకరిస్తాయని రచయిత అంటారు. ‘కలడు కలండనెడు వాడు కలడో లేడో’ అనే వ్యాసంలో జీవులకు ఆధారభూతమైన పరమాత్మ ఉన్నాడనే తత్వం తెలుసుకోవడమే ప్రజ్ఞ అని, ‘అందరికీ శ్రీహరే అంతరాత్మ’ అనే వ్యాసంలో సనాతన ధర్మం సామాజిక సమరసతా భావాన్ని ప్రస్ఫుటం చేసిందని స్పష్టపరుస్తూ, భారతీయ సనాతన ధర్మం తపస్సు, జ్ఞానసంపద, కర్తవ్యానుష్టాన మార్గంలో సాగుతుందన్న సత్యాన్ని రచయిత తేటతెల్లం చేశారు.
ప్రతి ఒక్కరూ ధర్మాన్ని అర్థం చేసుకోవడం, సంరక్షించడం, ఆచరించడం అనేది రచయిత ఆశిస్తున్న లక్ష్యంగా కనిపిస్తుంది. మన సంస్కృతిలో దాగి ఉన్న లోతైన ఆధ్యాత్మిక అంతరార్థాలను వెలికితీసే ప్రయత్నమిది. సాధారణంగా కఠినంగా అనిపించే వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని, పురాణాలలోని నీతిని రచయిత ఆధునిక దృక్పథంతో విశ్లేషించారు. భారతదేశం ఆధ్యాత్మిక విలువలకు, ధార్మిక సంస్కృతికి కేంద్రంగా విలసిల్లుతున్న వైనాన్ని బోధపర్చారు.
భారతీయ సనాతన ధర్మం విశ్వవ్యాప్తత, ప్రాచీనత - నిత్య నూతనత్వం, దాని శాశ్వతత్వాన్ని రచయిత ఆవిష్కరించారు. ఓంకారం మోక్ష సాధనం, సర్వజీవ ఏకత్వానుభూతి, నిజయోగం, పరమాత్మోపాసన మొదలైన విషయాలపై రచయిత చేసిన విశ్లేషణలు సామాన్య పాఠకుడి హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. వీటిలో ఉపయోగించిన నిదర్శనాలు, పురాణగాథలు, శ్లోకాలు నేటి సమాజానికి కాలానుగుణమైన మార్గదర్శనం చేస్తాయి. భావోద్వేగాలను కుదించకుండా, హితబోధనతో కూడిన వైఖరిని, సైద్ధాంతిక గాంభీర్యతను పాఠకులు గమనిస్తారు.
పఠితులు తమ అంతరాత్మను దర్శించుకోవడానికి చేయాల్సిన ఆధ్యాత్మిక ప్రయాణమేమిటో ఎరుకపరుస్తూ ఈ వ్యాసాలన్నీ చెక్కిన శిల్పాల్లా నిర్మితమయ్యాయి. రచయిత రాసిన ప్రతి శబ్దంలో ఒక ఉద్దేశం ఉంది. ప్రతి వాక్యంలో ఒక పరమార్థం ఉంది.
ప్రతి వ్యాసంలో జాతీయ ధర్మ స్పృహ ఉంది. ధర్మం, దేశం చరిత్ర అనేవి విడదీయలేని భావాలు. కనుక విదేశీ సంస్కృతుల విధ్వంసక వ్యూహాలను అవగాహనతో పరిశీలిస్తూ, మన సంస్కృతిని ఎలా పరిరక్షించాలనే దానిపై రచయిత స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. సిద్ధాంతాలను ఉటంకిస్తూ వాటిని నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవాలో కూడా సూచించారు.
ఈ గ్రంథం ధర్మాచరణను వ్యక్తిగత బాధ్యతగా చేస్తూ, పాఠకునిలో జ్ఞానజ్వాలను రగిలిస్తుంది. జాతీయ చైతన్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఏకకాలంలో కలిగిస్తుంది. తత్వచింతన, ఆధ్యాత్మిక చైతన్యం, ధార్మికత వంటి అంశాలలో ఆసక్తి ఉన్న సాధారణ పాఠకుడి నుంచి ఆధ్యాత్మిక అన్వేషి వరకు అందరికీ ఈ వ్యాసాలు జ్ఞానాన్ని అందిస్తాయి. సనాతనధర్మ వైజ్ఞానిక, తాత్విక సందేశంగా నిలిచే ఈ వ్యాసాల ద్వారా భాస్కరయోగి ఆధునిక ఋషిగా దర్శనమిస్తారు.
- స్తంభంకాడి గంగాధర్-
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
